Illegal Stones Transport to Machilipatnam Port: పర్మిట్లు లేకుండా బండరాళ్ల తరలింపు.. లారీలను సీజ్ చేసి రూ.లక్షల్లో జరిమానా - అక్రమంగా బండరాళ్ల తరలింపు న్యూస్
🎬 Watch Now: Feature Video
Illegal Stones Transport to Machilipatnam Port: కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద జరుగుతున్న పోర్టు నిర్మాణ పనులకు పర్మిట్లు లేకుండానే బండరాళ్లు తరలిస్తున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలోని పరిటాల నుంచి మచిలీపట్నానికి నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో బండరాళ్లను తరలిస్తున్నారు. సాధారణంగా రాళ్లు, కంకర, గ్రావెల్ తదితరాలేవి తరలించాలన్నా.. గనులశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే పోర్టు నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ మాత్రం పర్మిట్లతో పని లేకుండా బండరాళ్లను తీసుకెళ్తోంది. సగటున 40 టన్నులకుపైనే లోడ్‌తో లారీలు విజయవాడ మీదుగా బందరుకు నిత్యం రాత్రుళ్లు వెళ్తున్నాయి. ఈ క్రమంలో పోర్టు పనులకు బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీలకు పర్మిట్లు లేవని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. గనులశాఖ అధికారులకు.. పోర్టు పనులకే తరలిస్తున్నామని, బిల్లులు చెల్లించే సమయంలో మారిటైమ్ బోర్డు వీటి పర్మిట్ల మొత్తాన్ని మినహాయిస్తుందని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు బదులిచ్చారు. చివరకు గుత్తేదారు సంస్థ నుంచి సరైన వివరణ రాకపోవడంతో అధికారులు కొన్ని లారీలను మచిలీపట్నం, పామర్రు వద్ద సీజ్ చేసి లక్షల రూపాయల్లో జరిమానా విధించారు. అసలు ఎన్టీఆర్ జిల్లా నుంచి పర్మిట్లు లేకుండా బండరాళ్లు రవాణా అవుతుంటే అక్కడి గనులశాఖ అధికారులు, విజిలెన్సు విభాగం ఏం చేస్తోందనేది ప్రశ్నార్థకమైంది.