House Land Beneficiaries Agitation in Kakinada District: 'ఎమ్మెల్యేను గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారు..' - agitation in nagulaplly village kakinada
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 3:45 PM IST
House Land Beneficiaries Agitation in Kakinada District: కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలోని.. ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నాగులపల్లిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రెవెన్యూ అధికారులు.. విచారణకు రావడంతో సర్పంచ్ గౌరీ రాజేశ్వరి ఆధ్వర్యంలో వారిని అడ్డుకున్నారు. గ్రామంలో 630 మంది లబ్ధిదారులకు మూడేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలైతే ఇచ్చారు గానీ, స్థలాలు మాత్రం ఎవరికి అప్పగించలేదు. దీనిపై మూడేళ్లుగా లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దొరబాబును నిలదీశారు. ఆ తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు అనర్హులకు ఇచ్చారని గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు విచారణకు వచ్చారు. వీరిని అడ్డుకున్న గ్రామస్థులు.. ఎన్నిసార్లు విచారణ చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఆరుసార్లు విచారణ చేసినప్పుడు.. అర్హులా, అనర్హులా అన్న విషయం తెలియలేదా అని సర్పంచ్ గౌరీ రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పంచాయతీ నుంచే 3 వేల మెజార్టీ ఇచ్చి వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు తగిన బుద్ధి చెప్పారని వాపోయారు.