ప్రజాప్రతినిధులపై కేసులు - ప్రత్యేక ధర్మాసనం కోసం హైకోర్టులో విచారణ
🎬 Watch Now: Feature Video
High Court hearing on quick trial against MPs and MLAs: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించేందుకు తగిన ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు లో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఈ యేడాది నవంబర్ 9 న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు దీనిపై సుమోటో పిల్ ను నమోదు చేసింది. వ్యాజ్యంపై నేడు విచారణ జరిపింది. ప్రభుత్వం తరపు ఏజీ సహకారం కోసం తదుపరి విచారణను సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
విజయ్ హన్సారియా సూచనలు: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం సుప్రీంకోర్టు సూచనల మేరకు, ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల విచారణకు అనుసరించాల్సిన కార్యాచరణను సూచిస్తూ, అమికస్క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు పలు సూచనలు చేశారు. వివిధ హైకోర్టుల అభిప్రాయాలను క్రోడీకరించి, నివేదిక రూపొందించారు. కార్యాచరణ ప్రణాళికను అమలుచేసేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు, కేసుల వివరాలు, పురోగతిని వెల్లడించేలా ప్రత్యేక వెబ్సైట్ఏర్పాటు చేయాలని తన నివేదికలో పేర్కొన్నారు. సాక్షుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ గదులను కేటాయించాలని వెల్లడించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని సుప్రీంకోర్టుకు అమికస్క్యూరీ సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా కోర్టులు ప్రత్యేక ధర్మాసనాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాయి.