Rain in Vijayawada: విజయవాడలో భారీ వర్షం.. వడగాల్పుల నుంచి నగర వాసులకు ఉపశమనం - Vijayawada People Relief From Feat Waves
🎬 Watch Now: Feature Video
Vijayawada People Relief From Heat Waves : వేసవి కాలంలో ఎండలు దంచికొట్టాయి. 46 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఇక మృగశిర కార్తె వచ్చింది.. వర్షాలు పడి వాతావరణం చల్లబడుతుందని ఆశపడ్డారు. కానీ ఎండలు మాత్రం తగ్గలేదు.. మరోవైపు నైరుతి రుతుపవనాలు సైతం రాష్ట్రాన్ని తాకాయి. కానీ అవి ఎక్కడకు వచ్చాయో అక్కడే ఆగిపోవడంతో భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని జనమంతా ఎదురుచూశారు. గత రెండు వారాలుగా ఎన్టీఆర్ జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం భానుడి భగభగలకు అల్లాడిపోయారు. ఈరోజు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో అవస్థలు పడుతోన్న ప్రజలకు కాస్త ఉపశపనం కలిగింది. రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
జలమయమైన విజయవాడ రహదారులు : కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో మంగళవారం సాయత్రం భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించే సంకేతాలు అందిస్తున్నాయని నగర వాసులు అనుకుంటున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీలో రుతు పవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎండ తీవ్రతకు బయటకు రావాలంటేనే భయపడేవారు. ప్రస్తుతం వర్షం కురవడంతో విజయవాడ ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో ప్రజలు సేద తీరారు.
రెండు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు: నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. బుధవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భారీ వర్షాల రీత్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.