Teacher Transfer Students Crying: ఉపాధ్యాయుడు బదిలీ.. వెళ్లొద్దంటూ విద్యార్థినిలు కన్నీళ్లు - Students Get Emotional
🎬 Watch Now: Feature Video
Students Crying on Teacher Transfer: బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడికి పాఠశాల విద్యార్థినిలు కన్నీటి వీడ్కోలు పలికారు. శివన్న అనే ఉపాధ్యాయుడు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదేళ్లుగా తెలుగు బోధిస్తున్నారు. అయితే ప్రస్తుతం మడకశిరలోని బాలికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. ఐదేళ్లుగా ప్రతి విద్యార్థిని పట్ల శ్రద్ధ వహిస్తూ.. క్రమశిక్షణ మార్గంలో నడిపించిన ఆ ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారన్న వార్త విని విద్యార్థినిలు కృంగిపోయారు. వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. వీడ్కోలు సభ అనంతరం ఆ ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి వెళ్లిపోయే క్రమంలో.. ఆయనను హత్తుకుని విద్యార్థినిలు బోరున విలపించారు. వారి పాఠశాలలోనే కొనసాగాలని ప్రాధేయపడ్డారు. విద్యార్థినిలు కన్నీటిని చూసి ఆ ఉపాధ్యాయుడు కూడా కన్నీరు పెట్టుకుని.. విద్యార్థినిలను ఓదార్చారు. ఒక తండ్రి లాగా ఆదరించి.. తెలుగు సంస్కృతిని వివరించి విద్యాబోధన చేశానని ఉపాధ్యాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయతతో పలకరించటం వల్లే అభిమానం పెంచుకున్నారని వివరించారు.