'వైఎస్సార్సీపీ పాతమిత్రులంతా టచ్‌లో ఉన్నారు - తెలుగుదేశం ప్రభంజనం పునరావృతం'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 5:47 PM IST
Gannavaram Telugu Desam in-charge Yarlagadda Venkatarao : ఈ రాష్ట్రం బాగు పడాలంటే తనలా తెలుగుదేశంలో ఉండటమే సబబని తన పాత వైఎస్సార్సీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని టీడీపీ గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజల నాడి తెలుసుకున్న వైసీపీ నేతలు తనతో చాలా బాధలు చెప్పుకుంటున్నారని, 1994 ప్రభంజనం పునరావృతం అయ్యేలా ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితి ఉందని తెలిపారు. 1989లో తెలుగుదేశం గెలిచింది రెండు ఎంపీ స్థానాలే అయినా, 1994లో ఏం జరిగిందో చరిత్ర చెప్తోందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు తాను అన్నం పెడితే, ఆ పార్టీ తనకు సున్నం పెట్టిందని యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు.
రౌడీ షీటర్లు, చదువు, సంస్కారం లేని వారికే ఆ పార్టీలో ప్రాధాన్యమని మండిపడ్డారు. పనికిరాని మంత్రుల్ని పెట్టుకోవటం వల్లే వైఎస్సార్సీపీకి ఈ పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటిపై దాడికొచ్చి గొడవ చేసి మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి శాఖాపరంగా చేసిన ఒక్క సమీక్ష అయినా ఉందా అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలెవ్వరికీ అర్థం కావట్లేదని అన్నారు. గన్నవరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఉండవల్లిలో లోకేశ్‌ను కలిశారు. కృష్ణాజిల్లా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తన పాత మిత్రులెందరో తెలుగుదేశంలో చేరేందుకు తనని సంప్రదిస్తున్నారని ఆయన లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆచితూచి ముందుకెళ్దామని యార్లగడ్డ వెంకట్రావుతో లోకేశ్ చెప్పారు.