Venkaiah Naidu: పాక హోటల్‌లో ఇడ్లీ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి - ap news
🎬 Watch Now: Feature Video
Venkaiah Naidu had Breakfast at SSS Idli Hotel: గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే పాక హోటల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తన మిత్రులతో కలిసి ఇడ్లీ రుచి చూశారు. విజయవాడ పిన్నమనేని పాలిటెక్నిక్ రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎస్ పాక హోటల్‌లో అల్పాహారం చేశారు. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో వెంకయ్యనాయుడు పాక హోటల్‌కు వచ్చారు. గన్నవరం స్వర్ణభారత్ ట్రస్టు నుంచి అల్పాహారం చేసేందుకు వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు.
హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను ప్రశంసించారు. తనకు ఇడ్లీ అంటే చాలా ఇష్టమని.. గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నానని తెలిపారు. పిజ్జా, బర్గర్లు ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా.. యువతరం.. మన వంటకాల రుచులను అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలన్నారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమేనని.. అలాగే మన సంప్రదాయ వంటలే మనకు బలం ఇస్తాయన్నారు. వ్యాయామం ఎంత ముఖ్యమో మన వంటలు తినడం అంతే ముఖ్యమన్నారు.