Cheetahs in Tirumala: 'భక్తులు వేసే వ్యర్థాల వల్లే.. చిరుతలు వస్తున్నాయి' - తిరుమలలో చిరుతలు
🎬 Watch Now: Feature Video

FOREST OFFICER MADHUSUDHAN REDDY: వన్య ప్రాణుల నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల రక్షణకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని తితిదే ఈవో ధర్మారెడ్డి హామీ ఇచ్చినట్టు.. అటవీ సంరక్షణ శాఖ అధికారి మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు భక్తులు సురక్షితంగా చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. శేషాచల అడవుల్లో చిరుతల సంచారం గణనీయంగా పెరిగాయన్నారు. తిరుమలకు నడక మార్గల్లో వచ్చే భక్తులు ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు వేయడం వల్ల.. వాటి కోసం వచ్చే పందులు, కుక్కలు, కోతుల కోసం చిరుతలు వస్తున్నాయన్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అటవీ శాఖకు కావాల్సిన అత్యాధునిక పరికరాలు, సిబ్బందిని అందించేలా సహాయం చేస్తామని తితిదే ఈవో చెప్పారన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని అటవీ సంరక్షణ అధికారి మధుసూధన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. శేషాచల అడవుల్లో జంతువులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అనే సమాచారం కెమెరాల ద్వారా గుర్తించాలని, భవిష్యత్లో వన్య ప్రాణుల నుంచి భక్తులకు హాని జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారన్నారు.