Gangamma Jatara ఐదోరోజు తాతయ్యగుంట గంగమ్మ జాతర..ఆకర్షణగా నిలిచిన మాతంగి వేషాలు
🎬 Watch Now: Feature Video
Tirupati Gangamma Jatara: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా ఐదవ రోజు భక్తులు మాతంగి వేషంలో గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయానికి భారీగా చేరుకుని అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా రకరకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాతంగి వేషంలో భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మగవారు ఆడవారికి ఏమాత్రం తీసుపోని విధంగా కట్టు, బొట్టుతోపాటు మల్లెపూలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మాతంగి వేషంతో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.. మరో వైపు జాతరలో భాగంగా గంగమ్మ తల్లి భక్తి చైతన్య యాత్ర చేపట్టారు. అనంత వీధి నుంచి ప్రారంభమైన యాత్ర పరసాల వీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి కళాక్షేత్రం, ఎస్పీ కార్యాలయం, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా గంగమ్మ గుడికి చేరుకుంది. యాత్రలో ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషతో పాటు నగర ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రోజా పట్టు వస్త్రాలు సమర్పించారు.