వైసీపీలో చర్చాంశనీయంగా బాలినేని- సీఎం జగన్ తీరుపై అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి - సీఎం జగన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 10:20 AM IST
EX Minister Balineni Srinivasa Reddy Disappointing with CM Jagan: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్ల ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశమైంది. బాలినేనిని పొమ్మనకుండా పొగబెడుతున్నారా అని వైఎస్సార్సీపీ నేతలే అనుమానిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చిన జగన్ ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై ఇంకా తేల్చలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు సీటు విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని ఇప్పటికే ప్రకటించగా ఆ స్థానానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. బాలినేని మాత్రం ఏమైనా సరే ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి అభ్యర్థిత్వం సహా ఒంగోలు అసెంబ్లీకి ఇతర నేతలను ఇంఛార్జ్‌గా నియమించేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
తన సీటుతో పాటు ప్రకాశం జిల్లాలో పలు స్థానాల అభ్యర్థులపై చర్చించేందుకు బాలినేనికి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని సమాచారం. మంగళవారం బాలినేనికి సమయం ఇచ్చిన జగన్ చివరి నిముషంలో రద్దుచేశారు. మూడు రోజులు విజయవాడలో వేచి చూసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన బాలినేని హైదరాబాద్ వెళ్లిపోయారు. జగన్‌తో పాటు కొందరు ముఖ్య నేతల తీరుపై తన అనుచరుల వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. జగన్‌కు విధేయుడిగా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన బాలినేనికే ఈ పరిస్థితి ఉంటే తమ పరిస్థితి ఏమిటోనని కొందరు వైఎస్సార్సీపీ నేతలు చర్చించుకుంటున్నారు.