బతుకుతామని అనుకోలేదు.. స్థానికులే రక్షించారు: ఒడిశా రైలు ప్రమాద బాధితులు
🎬 Watch Now: Feature Video
Odisha Train Accident Passengers : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భయంకర అనుభవాన్ని చవి చూశామని.. ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డ ప్రయాణికులు అంటున్నారు. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం ఒక్కసారిగా కుదుపులకు లోనైందని చెప్పారు. భయకరమైన శబ్దం వచ్చి రైలు ఆగిందని అన్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వందల మంది బోగీల మధ్య ఇరుక్కుపోయారని.. వారిలో చాలామంది మృత్యువాతపడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. పల్టీలు కొట్టిన బోగిలలోని ప్రయాణికులలో సగం కంటే ఎక్కువే ప్రాణాలు కోల్పోయారని ఆవేదనకు లోనయ్యారు. స్థానికులు, అధికారుల చొరవ వల్లే తాము వెంటనే బయటపడగలిగామని వివరించారు. ప్రమాదం జరిగిన తీరు వల్ల బతుకుతామనే ఆలోచన కూడా రాలేదని.. పక్కకు ఒరిగిన బోగిలలోని ప్రయాణికులు అన్నారు. రైలు పెట్టె పక్కకు ఒరిగిపోవటంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయినట్లు వారు తెలిపారు. బోగీలు పక్కకు ఒరిగిపోవటంతో అందులోని లైట్లు ఆగిపోయాయని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు.. రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో విశాఖ చేరుకున్న బాధితులు తెలిపారు. వారితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.