బకాయిలను తక్షణమే చెల్లించాలి - ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు : బొప్పరాజు
🎬 Watch Now: Feature Video
Employees Association on Pending Arrears: ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో అందక ఉద్యోగులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీజేఏసీ నేతలు తెలిపారు. బకాయిలపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ఏపీజేఏసీ నేతలు బొప్పరాజు, వలిశెట్టి దామోదర్, ఇతర సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లుకు, పోలీసులకు డీఏ, సరండర్ లీవులు, రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీజేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం దాచుకున్న డబ్బులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చెల్లింపులపై హామీ ఇచ్చినా నేటికీ అవి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కనీసం పెన్షనర్లకు ముందుగా చెల్లించమని కోరినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పూర్తి స్థాయిలో అమలు కాక ఉద్యోగులు ఆస్పత్రుల వద్ద అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదేళ్లుగా కారుణ్య నియామకాలు అమలు కాక వందలాది ఉపాధ్యాయ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు.