CPM Vidyut Porubata Padayatra: సామాన్యులపై విద్యుత్ భారం.. తొలగించాలని సీపీఎం పోరుబాట - విజయవాడ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
CPM Vidyut Porubata Padayatra: సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో విద్యుత్ పోరుబాట పాదయాత్ర ప్రారంభమైంది. నగరంలోని వివిధ కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా పాదయాత్ర చేపట్టారు. వారం రోజులపాటు ఈ పోరుబాటు కొనసాగుతుందని సీపీఎం నేత సీహెచ్ బాబురావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజల కళ్లు కప్పి.. షాక్‌లు ఇస్తున్నారని చెప్పారు. సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారాలు వెయ్యడం అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను పేరుతో భారాలు వేసిందని, ఇవి చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా విద్యుత్ భారాలు ప్రజలపై వేస్తోందని అన్నారు. దేశంలో అదానికి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహితులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తీసేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రజల కొంపముంచే స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని ఆయన అన్నారు. అవసరమైతే విద్యుత్ కార్యాలయాలను స్తంభింపజేస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలో సీపీఎం నేతలకు.. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలతో వారు పడుతున్న ఇబ్బందులు స్థానికులు వివరించారు.