MLA Jagan Mohan: ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు నిరసన సెగ.. ప్రశ్నించిన డ్వాక్రా సంఘాల మహిళలు - Ntr District
🎬 Watch Now: Feature Video
MLA Jagan Mohan Rao : వైసీపీ ఎమ్మెల్యెేలకు ప్రజల నుంచి నిరసన సెగలు తప్పటం లేదు. ప్రజల్లోకి వెళ్లటమే ఆలస్యం తమ సమస్యలపై ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావును స్థానిక మహిళలు నిలదీశారు. మహిళ సంఘాల ఖాతా నుంచి 20 వేల రూపాయల వరకు నగదు మాయం అయ్యిందని ఎమ్మెల్యేను అడ్డగించారు.
అసలేం జరిగిందంటే : ఎన్టీఆర్ జిల్లాలోని పెండ్యాల గ్రామంలోని తుర్లపాడు హజరత్ బందగీ మియా సయ్యద్ దర్గా ఉరుసు ఉత్సవాలను ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన వచ్చిన క్రమంలో.. గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు వారి సమస్యను విన్నవించుకునేందుకు సిద్ధమయ్యారు. మహిళ సంఘాల ఖాతా నుంచి సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు నగదు మాయమైనట్లు ఎమ్మెల్యేకు వివరించేందుకు వెళ్లారు. నగదు మాయమైన అంశంపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఎంపీపీ బషీర్ అసభ్యకరమైన పదజాలంతో దూషించాడని మహిళలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎమ్మెల్యే వారికి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఇచ్చేది ఈతకాయ.. తీసుకునేది మాత్రం తాటికాయ అంటూ మహిళలు మండిపడ్డారు. వడ్డీ లేని రుణాలంటూ.. జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క రుణాలకు నగదు వసూలు చేస్తూ.. మరో పక్క వడ్డీ ఇచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. ఇలా ఇచ్చినట్లు చేసి.. నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, అన్ని వస్తువుల ధరలు పెంచి, రెండింతలు వసూళ్లు చేస్తున్నారన్నారు.