తీవ్ర ఉద్రిక్తతల నడుమ మహేంద్ర అంత్యక్రియలు పూర్తి - dalit youth Mahendra suicide
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 16, 2023, 1:37 PM IST
Dommeru Dalit Youth Mahendra Funeral Completed: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ యువకుడు బొంతా మహేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అధిక సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు. మహేంద్ర అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. ఈ వ్యవహారంలో కొవ్వూరు టౌన్ ఎస్సై భూషణంను సస్పెండ్ చేశారు. అయితే రాత్రి అతని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇంతకీ ఏం జరిగిందంటే: ఈ నెల 6వ తేదీన కొవ్వూరు మండలం దొమ్మేరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నాగరాజు, సతీష్ తదితరులు ఫ్లెక్సీలు కట్టారు. నాగరాజు, సతీష్ ముఖాలు ఉన్న భాగాన్ని ఎవరో చించేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కొవ్వూరు టౌన్ సీఐ రమ్మన్నారంటూ ఈ నెల 13వ తేదీన మహేంద్రను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు స్టేషన్లోనే అతనిని ఉంచారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహేంద్ర పురుగుల మందు తాగాడు. దీంతో అతన్ని చాగల్లు, కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స అందించారు.
పరిస్థితి విషమించడంతో నిన్న విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రాత్రి అతని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన సమయంలో స్థానిక యువకుల్లో కొంతమంది.. పోలీసులపై సీసాలు, రాళ్లు విసిరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఏఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తలకు గాయమైంది. ఫ్లెక్సీ చిరిగిన వివాదంలో మహేంద్రను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉంచడంతోనే.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.