Demolition of Muthyalamma Ammavari Temple: ముత్యాలమ్మ ఆలయాన్ని కూల్చివేసిన అధికారులు.. స్థానికుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Demolition of Muthyalamma Ammavari Temple in Nandigama : ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఉమా కాలనీలో నిర్మాణంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చి చేశారు. దీంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్, అధికారుల సహకారంతో మున్సిపల్ అధికారులు జేసీబీతో దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీనిపై కాలనీలోని అమ్మవారి భక్తులు, కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చి వేసిన ఆలయం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఉమా కాలనీలో మున్సిపాలిటీ స్థలంలో దశాబ్దాల నుంచి ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ఉంది. అక్కడే అమ్మవారికి పూజలు నిర్వహించే వాళ్ళు. అమ్మవారికి ప్రత్యేకంగా దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణం తుది దశకు చేరుకున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆలయాన్ని కూల్చి వేశారు. దీనిపై భక్తులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని కూల్చివేసిన ఆలయంవద్దకు తీసుకొచ్చి ఉంచి పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొంతమంది మహిళా భక్తులకు అమ్మవారు పూనకం వచ్చింది. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య ఆలయాన్ని పరిశీలించారు. భక్తులు విరాళాలతో నిర్మించిన ముత్యాలమ్మ ఆలయాన్ని కూల్చివేయటం ఏంటని ప్రశ్నించారు. కేవలం కక్షపూరితంగానే ఆలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరటం వల్లనే ఆలయాన్ని కూల్చివేశారని తెలిపారు. నందిగామకు కనీసం తాగునీరు సరఫరా చేయలేని వైసీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆలయాలను మాత్రం కూల్చివేస్తున్నారని సౌమ్య ఆరోపించారు.