Dalits Dharna on Caste Discrimination చదువుకుంటున్న పిల్లలు బానిసల్లా ఉండలేరుగా ! సీఎం సొంత జిల్లాలో కుల వివక్షపై దళితుల ఆందోళన.. - Dalits
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 7:48 PM IST
Dalits Dharna on caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో తిప్పలూరు గ్రామ దళితులు ధర్నా చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలోని అగ్రవర్ణాల వీధుల్లో.. ఎలాంటి సంబరాలు, పెళ్లి ఊరేగింపులు నిర్వహించవద్దంటూ దళితులను బెదిరిస్తున్నారంటూ వాపోయారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నడుచుకుంటూ వెళ్లాలని, లేదంటే దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా తాము బయటికి చెప్పుకోలేదని తెలిపారు.
వినాయక విగ్రహం తమ ఇళ్ల వద్ద నిలబెట్టుకున్నప్పుడల్లా ఇదే గొడవ జరుగుతోందని, ప్రతి సంవత్సరం నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజే పెట్టకుండా వెళ్లాలని అగ్రవర్ణాల వాళ్లు హెచ్చరిస్తున్నారని చెప్పారు. తాము ఎన్నాళ్లిలా బానిస బతుకుల బతకాలని ప్రశ్నిస్తూ.. చివరకు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ రోజు ఎర్రగుంట నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా చేస్తుంటే... రెండు వారాలలో వచ్చి మీకు న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారని వెల్లడించారు. కూలీ పని చేసుకుని బతికే తాము ఒప్పుకున్నా.. పెద్ద చదువులు చదివిన తమ పిల్లలు ఎప్పటికీ బానిసల్లా ఎలా ఉంటారని వారు ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.