CPI Ramakrishna on Alliance: 'జగన్ను గద్దె దించడానికి జనసేన, టీడీపీతో చేతులు కలుపుతాం' - ఆంధ్రప్రదేశ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna Comments on Jagan: ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ కక్షపూరిత పాలన.. చివరి దశకు వచ్చేసరికి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బంగ్లాకు అటాచ్మెంట్ అంటూ ప్రత్యేక జీవోను తీసుకొచ్చేవరకు వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ కక్షపూరిత రాజకీయాలను సీపీఐ ఖండిస్తోందని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులకు హాజరైన రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరిత రాజకీయాలు నడుపుతున్నాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ తమకు అనుకూలంగా ఉన్నవారితో ఒకలా.. వ్యతిరేకంగా ఉన్నవారితో మరొకలా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి నెలా జగన్ రూ.100 కోట్లు కొల్లగొడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. జగన్ను గద్దె దించడానికి రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీలతో చేతులు కలుపుతామని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. జగన్ని ముందుగా ఇంటికి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను ఖండిస్తున్నామని ఆగ్రహించారు.