CPI Ramakrishna on GVL Narasimha Rao: బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి: రామకృష్ణ - ఏపీ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 5:01 PM IST
CPI Ramakrishna on GVL Narasimha Rao : ప్రజల కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని , స్వాతంత్య్ర పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గుర్తు చేశారు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుకు లేదని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన జీవీఎల్ నరసింహారావుకు రాష్ట్రంలో ఏం పని అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి జీవీఎల్ చేసిన కృషి ఏంటో చెప్పాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎందుకని అమలు చేయలేకపోయారో జీవీఎల్ చెప్పాలని కోరారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి వచ్చే పార్టీలతో కమ్యూనిస్టులు సర్దుబాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.
బీజేపీ నేతలు జనసేన వెంట ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము బీజేపీకు ఉందా అని ప్రశ్నించారు. ఒక స్థానంలో కూడా కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీకి రావని, నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని రామకృష్ణ తెలిపారు.