రైతుల కష్టాలు చూడ్డానికి వెళ్లావా లేక క్రికెట్ చూడటానికి వెళ్లావా జగన్: సీపీఐ రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna Allegations on CM Jagan: సీఎం జగన్ రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం వీకే భవన్‌లో పార్టీ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రంలో ప్రజలు కరవు, తుపాన్లతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్ కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అన్నదాతలను పరామర్శించే తీరిక లేదా అని సీఎంను ప్రశ్నించారు. తుపాన్ ప్రాంత రైతుల కష్టాలు, నష్టాలు తెలుసుకోకుండా కేవలం క్రికెట్ చూడటానికి వచ్చిన వాడిలా ముఖ్యమంత్రి వచ్చారని విమర్శించారు.
460 మండలాల తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతుంటే కేవలం 103 మండలాల్లో కరువు ఉందని ఏకగ్రీవ తీర్మానం చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసారని ఈ ముఖ్యమంత్రి ఉండగా పోలవరం ప్రాజెక్టు ఎన్నటికి కూడా పూర్తి కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలని లేకపోతే తెలంగాణ దొరకి పట్టిన గతే పడుతుందన్నారు. కరవు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌తో ఈనెల 11న ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 14న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.