శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మళ్లీ దుకాణాల వివాదం వ్యాపారుల నిరసన - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 8:13 PM IST
Controversy Over New Shops in Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలోని కొత్త దుకాణాల వివాదం మళ్లీ రాజుకుంది. దేవస్థానానికి చెందిన లలితాంబిక దుకాణ సముదాయంలో జె, కె, ఎల్ బ్లాకుల మధ్య కొత్త దుకాణాలు ఏర్పాటు చేయకూడదని వ్యాపారులు నిరసనకు దిగారు. వ్యాపారులకు స్థానిక బీజేపీ, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. జె, కె, ఎల్ బ్లాక్‌ల మధ్య గతంలో భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్లు నిర్మించారు.
వైసీపీకి చెందిన కొందరు దుకాణదారులకు లబ్ది కలిగించేందుకే ప్రస్తుతమున్న మరుగుదొడ్లను తొలగించి ఆ స్థానంలో కొత్త దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం సరికాదని వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులు దుకాణాల సముదాయం వద్ద బైఠాయించి దేవస్థానం అధికారులు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రెవెన్యూ విభాగం ఏఈఓ ఫందర్ ప్రసాద్ దుకాణదారుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వ్యాపారులు ఆందోళన విరమించారు.