Tulasi Reddy Fire on Government: 'కేంద్ర ఫైనాన్స్ నిధులను గ్రామ పంచాయతీల అకౌంట్లకు బదిలీ చేయాలి' - ap news
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy Fire on Government : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదని, దానికి తోడు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడంపై సోమవారం తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తాజాగా సర్పంచులు సమస్యలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ నిధులను వాడుకుంటున్న ప్రభుత్వం : విధులు, నిధులు, అధికారాలు లేక జగన్ పాలనలో సర్పంచులు ఉత్సవ విగ్రహలుగా, గారకాయలుగా, ఆరవ వ్రేలుగా తయారు కావడం దురదృష్టకరం అని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడమే కాక, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన దాదాపు 10 వేల కోట్ల రూపాయలును సర్పంచుల సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకున్నదని ఆయన ఆరోపించారు.
గ్రామ పంచాయతీలు నిర్వీర్యం : గోరు చుట్టుపై రోకలి పోటులా జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, గ్రామ పంచాయతీలను మరింత నిర్వీర్యం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశానికి ప్రధానమంత్రి ఎలాగో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అలాగే అని తులసి రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ డిమాండ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న కేంద్ర ఫైనాన్స్ నిధులను గ్రామ పంచాయతీల అకౌంట్లకు బదిలీ చేయాలని, రాష్ట్ర ఫైనాన్స్ నిధులను విడుదల చేయాలని.. వాలంటీర్, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీల ఆధీనంలోకి తేవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.