College Students Fight విద్యార్ధి యూనిఫాం గొడవ.. రణరంగంగా మారిన కాలేజీ! - fight in Dr VS Krishna Junior College
🎬 Watch Now: Feature Video
College Students Fight: విశాఖలోని ఓ కళాశాలలో యుద్ధాన్ని తలపించిన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తన్నుకున్నారు. విషయం పెద్దది కావడంతో ఎంవీపీ పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ చేసి పంపేశారు. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ వీఎస్ కృష్ణా జూనియర్ కళాశాలలో ఇంటర్ తొలి సంవత్సరం చదువుకున్న ఓ విద్యార్థి యూనిఫారం లేకుండానే కళాశాలకు వచ్చాడు. దీంతో టీచర్ ఆయన్ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని బయటకు పంపించేశాడు. అయితే తనను అకారణంగా కళాశాల నుంచి బయటకు వెళ్లగొట్టారనే నెపంతో ఇతర ప్రాంతంలో ఉన్న తన స్నేహితుల్ని పిలిచి కళాశాలలో వీరంగం చేయించాడు. అనంతరం మరో వర్గం రంగంలోకి దిగి వారిని బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కళాశాలతో పాటు అక్కడి వీధులన్నీ విద్యార్థుల గొడవతో నిండిపోయాయి. కళాశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని విద్యార్థులు చెదరగొట్టారు. గొడవకు కారణమైన కొంతమంది విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో హెచ్చరించి పంపించేస్తామని, ఇప్పటికే కౌన్సెలింగ్ చేశామని పోలీసులు తెలిపారు.