Cigarette controversy: సిగరెట్ తాగొద్దన్న స్నేహితుడు.. పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
🎬 Watch Now: Feature Video
Cigarette controversy young man died: 'పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం-ప్రాణాలకు ప్రమాదం, క్యాన్సర్‌కు కారకం' అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా ప్రకటనలు చేస్తున్నా.. యువతలో మాత్రం ఎటువంటి మార్పు రావటంలేదు. సిగరెట్ తాగొద్దని.. తల్లిదండ్రులు, స్నేహితులు, పక్కనున్న వారు పలుమార్లు హెచ్చరించినా వినటంలేదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో దారుణం జరిగింది. సిగరెట్ తాగుతున్నావని ఇంట్లో చెప్తానంటూ హెచ్చరించిన స్నేహితుడిపై ఓ యువకుడు ఆవేశానికి లోనై..పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సిగరెట్ వివాదం యువకుడు మృతి.. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో సిగరెట్ వివాదం ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకుంది. అమరాపురం మండలానికి చెందిన కె.శివరంలో మహంతేష్ అనే యువకుడు సిగరెట్ తాగుతుండగా, గమనించిన అతని స్నేహితుడు రంగనాథ్.. ఇంట్లో చెబుతానంటూ హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి గురైన మహంతేశ్.. షాపులో ఉన్న సీసాల్లోని పెట్రోలు తీసి రంగనాథ్‌పై పోసి, నిప్పంటించాడు. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని బెంగళూరు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తుండగా రంగనాథ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్షణికావేశంలో దారుణం.. ''ఓ చిల్లర కొట్టు వద్ద మహంతేష్ సిగరెట్ కాల్చుకొని పొగ తాగుతున్నాడు. అది చూసిన అతని మిత్రుడు రంగనాథ్ సిగరెట్ తాగొద్దని అతనితో వారించాడు. ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతానంటూ మహంతేష్‌ను రంగనాథ్ హెచ్చరించాడు. దీంతో క్షణికావేశానికి లోనైనా మహంతేష్.. కొట్టులోని బాటిల్లో ఉన్న పెట్రోల్‌ను తీసి రంగనాథ్‌పై పోసి, ఆ వెంటనే నిప్పంటించాడు. స్థానికులు మంటలు ఆర్పి, సిరా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రంగనాథ్ మృతి చెందాడు'' అని పోలీసులు తెలిపారు.