Chandrababu Legal Mulakats Reduced: చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు కోత.. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ టీడీపీ ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 2:47 PM IST
Chandrababu Legal Mulakats Reduced: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత పెట్టారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు పడుతున్నందునే ఈమేరకు కోత పెడుతున్నామని పేర్కొన్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖాత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది.. ఇప్పుడే ఎందుకు వచ్చిందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్‌లను కూడా కుదించడం కుట్రే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో తనపై అక్రమ కేసుల విషయంలో చంద్రబాబు పోరాడుతున్నారు. ఈ సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబసభ్యులు అంటున్నారు. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు అంటూ కుటుంబసభ్యులు, పార్టీ నేతలు మండిపడ్డారు.
TDP Leaders Meet DIG Ravikiran: దీనిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు టీడీపీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు లీగల్ ములాఖత్ తగ్గించడంపై డీఐజీ రవికిరణ్‌తో టీడీపీ నేతల చర్చించారు. చంద్రబాబు కేసులపై వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతోందని.. కేసుల విచారణ దృష్ట్యా లాయర్లతో చంద్రబాబు మాట్లాడాలని తెలిపారు. చంద్రబాబుతో రోజుకు 2 సార్లు లీగల్ ములాఖత్ ఇవ్వాలని కోరారు. టీడీపీ నేతల వినతిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రవికిరణ్ అన్నారు.