Somu Veerraju on YCP Govt: 'కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు'
🎬 Watch Now: Feature Video
Somu Veerraju: రాష్ట్రానికి కేంద్రం ఏం ఇస్తే? ఇక్కడి ప్రభుత్వాలు ఏం చేశారో.. బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ చేశారు. నాలుగేళ్ల పరిపాలన అంటూ ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీలను ఊరంతా కట్టారని.. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు? అవినీతి ఏమిటి? రాష్ట్రం ఎందుకు తిరోగమనంలోకి వెళ్తోంది? తొమ్మిదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటనేది చర్చించేందుకు తాము సిద్ధమని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. పారిశ్రామికవాడల అభివృద్ధితోనే పెట్టుబడులు వస్తాయని.. అక్కడ మౌలిక వసతులకు కేంద్రం సాయం అందిస్తున్నా.. పారిశ్రామికవాడల స్థితిగతులపై సమీక్షించేందుకు సీఎంకు తీరిక లేదని ధ్వజమెత్తారు.
అంశాల వారీగా కేంద్ర నుంచి రాష్ట్రానికి అందిన సాయాన్ని గణాంకాలతో సహా మీడియా సమావేశంలో వెల్లడించిన వీర్రాజు.. బీజేపీ రాష్ట్రంలో బలోపేతం అయితే ప్రాంతీయ పార్టీల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఉద్దేశ్యంతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతవరకు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఎందుకు వాటిని అందించలేదని ప్రశ్నించారు.
ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకుంటూ ఆరోగ్యశ్రీ అని ఎందుకు అంటున్నారని నిలదీశారు. వైద్య కళాశాలలకు కేంద్రం నిధులు ఇస్తే అవి తమ సొంత నిధులుగా ఎలా ప్రచారం చేసుకుంటారని.. కేంద్రం నిధులు ఇచ్చిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోడ్లు వేసిందో వివరాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.