BJP State President Purandeshwari on Power Cuts: విద్యుత్ కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: పురందేశ్వరి
🎬 Watch Now: Feature Video
BJP State President Purandeshwari on Power Cuts: రాష్ట్రం విద్యుత్ కోతలతో అతలాకుతలం అవుతుంటే.. ముఖ్యమంత్రి జగన్.. విదేశీ పర్యటనకు వెళ్లడమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే.. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ఆమె నిలదీశారు. అప్రకటిత కోతలతో గ్రామీణ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న పురందేశ్వరి.. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Purandeshwari Fire on Electricity Officials: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 'టీచర్స్ డే' వేడుకల్లో పురందేశ్వరి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..''రాష్ట్రానికి పవన, సౌర, థర్మల్ విద్యుత్ ఎంత అవసరం..?, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం రూపంలో వివరాలు వెల్లడించాలి. బొగ్గు నిల్వలు ఎంత ఉండాలి..? ప్రస్తుతం ఏ మేరకు ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలి. రోజుకు 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటే.. 42 మిలియన్ యూనిట్ల కొరత కళ్లెదుట కనిపిస్తోంది. ఈ కొరతను అధిగమించుకునేందుకు అప్రకటిత విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పీపీఏలకు న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం కూడా చెల్లింపులు చేయడం లేదు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే అవకాశం సన్నగిల్లింది. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో రెండు రోజుల క్రితం కోత విధిస్తున్నామన్న అధికారులు.. ఇప్పుడు లేదు లేదు అన్నీ సవ్యంగానే ఉన్నాయంటూ ప్రకటనలు వెలువరించటం సందేహాన్ని కలిగిస్తున్నాయి'' అని ఆమె అన్నారు.