న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం: ఆయుష్ ఉద్యోగులు - ఆయుష్ ఉద్యోగులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 5:21 PM IST
|Updated : Jan 8, 2024, 5:47 PM IST
Ayush Employees Protest at Tadepalli YCP Office: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు ఆయుష్‌లో తొలగించిన ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాలుగన్నరేళ్లుగా మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితే కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. గతంలో విజయవాడ ధర్నా చౌక్‌లో 274 రోజులు ధర్నా నిర్వహించామని ఆయుష్ ఉద్యోగులు తెలిపారు. జగన్ ప్రతిపక్షంలో ఉండి మీ సమస్యను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఉద్యోగాలు లేక 8మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కనీసం వాళ్ల కుంటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నది లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని ఓట్లు వేసి గెలిపించామని ఆయుష్ ఉద్యోగులు అన్నారు. కానీ ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదని వాపోయారు. సీఎం జగన్ మాకు న్యాయం చేయకపోతే కుటుంబంతో సహా వైసీపీ కార్యాలయం ముందే అత్మహత్య చేసుకుంటామని వారంతా హెచ్చరించారు.