JC Asmith Reddy fire on YCP workers: 'ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తారా..? అలాగే చేస్తామంటే చూసుకుందాం' - JC Asmith Reddy news
🎬 Watch Now: Feature Video
JC Asmith Reddy fire on YSRCP leaders: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విపక్షాలపై దాడులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అక్రమాలు, అవినీతి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే చాలు.. సామాన్యులపైనే కాదు.. ప్రతిపక్షాల నాయకులపై కర్రలతో, రాడ్లతో వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని గన్నేవారిపల్లిలో టీడీపీ నాయకులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. వైఎస్సార్సీపీకీ వ్యతిరేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా..? అంటూ కత్తులు, కర్రలతో ప్రతిపక్ష నేతలపై దాడి చేయగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన గోపాల్, చింబిలి వెంకటరమణ, రాంబాబు, విష్ణు, అమీర్‌ను తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇలాగే దాడులు చేస్తామంటే చూసుకుందాం.. దాడి విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేత జేసీ అస్మిత్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..''అన్యాయాన్ని ప్రశ్నిస్తే, దాడులు చేస్తారా..?. ప్రతిపక్షంలో ఉన్న వారు విమర్శలు చేస్తారు. చేతనైతే వివరణ ఇవ్వాలి కానీ, ఇలా దాడులు చేయటం ఏమిటి..?. ఇలా దాడులు చేస్తే ఇంట్లో నుంచి బయటకు రారని అనుకుంటున్నారేమో..?, మీరు ఎన్ని దాడులు చేస్తే అంత కంటే ఎక్కువగా బయటకొస్తారు. దాడులు చేసిన వారిపైనేమో బెయిలబుల్ కేసులా.. బాధితులపైనేమో నాన్ బెయిలబుల్ కేసులా..?, గొడవలు వద్దనుకున్నాం. కానీ, మీరే రెచ్చగొడుతున్నారు. ఇలానే దాడులు చేస్తామంటే ఇకపై చూసుకుందాం.'' అంటూ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు.