Amaravati Farmers Annual Rent Case in High Court: అమరావతి రైతులకు కౌలు చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకున్నారు: హైకోర్టు - రాజధాని రైతులు హైకోర్టులో రిట్ అప్పీల్ విచారణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 9:57 PM IST

AP High Court Regarding the Payment of Annual Rent to the  Amaravati Farmers: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ (CRDA)పై ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు సొమ్ము చెల్లించేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ వి.సుజాతతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.

Amaravati Farmers Fight for Annual Rent: అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య:  రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య’ సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్‌రెడ్డి, ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఆ ఉత్తర్వులపై పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు.  సింగిల్‌ జడ్జి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌ దాఖలు చేయవచ్చా? అని న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. ఒక్కసారి అనుమతిస్తే ఇదే తరహా అప్పీళ్ల దాఖలుకు అంతులేకుండా పోతుందని వ్యాఖ్యానించింది. అత్యవసరంగా అప్పీల్‌ వేయడానికి ఇది నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కాదు కదా? అని ప్రశ్నించింది.  

Amaravati Farmers about Govt and CRDA: కౌలు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది కదా?:  పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. తాము దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత ఉందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు. భూములిచ్చిన రైతులకు ఏటా మే 1లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందన్నారు. ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం, సీఆర్‌డీఏ తీరుతో రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమకు ఇవ్వాల్సిన కౌలు సొమ్ము కోసం రైతులు న్యాయబద్ధ అభ్యర్థన చేస్తున్నారన్నారు. సీఆర్‌డీఏ తరఫున ఎస్‌జీపీ కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. సీఆర్‌డీఏ, రైతుల మధ్య ఒప్పంద వ్యవహారంలో రైతు సంఘాలు వ్యాజ్యం దాఖలు చేయడంపై అభ్యంతరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. భూములిచ్చిన రైతులకు చట్టబద్ధంగా వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది కదా? అని ప్రశ్నించింది. ఆ సొమ్ము చెలించేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.