Allegations on Police Constables: కోడిని అపహరించాడని.. కాలు విరగ్గొట్టారు..! ఇద్దరు కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు - పద్మనాభం పోలీస్‌స్టేషన్ వద్ద స్థానికుల నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 3:16 PM IST
|Updated : Oct 2, 2023, 3:21 PM IST
Allegations on Police Constables: విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో.. కోడి దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతో కాలు విరిగింది. పద్మనాభం మండలం బాందేపురంలో పది రోజుల క్రితం కోడి దొంగతనం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన పాపునాయుడు అనే వ్యక్తిని పోలీసులు విచారణకు తీసుకువెళ్లారు. గ్రామంలోని పెద్దల సమక్షంలో తానే దొంగతనం చేసినట్లు అతను తప్పు ఒప్పుకున్నాడు. నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని బాధితులు తెలిపారు. గత 4 రోజుల నుంచి విచారణ పేరుతో ఉదయాన్నే పోలీస్ స్టేషన్కు రప్పించి రాత్రి వరకు ఉంచేవారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు మద్యం సేవించి.. విచక్షణారహితంగా కొట్టడంతో పాపునాయుడు కాలు విరిగిందని బాధితుని బంధువులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కు డీసీపీ గంధం నాగన్న, దిశ ఏసీబీ వివేకానంద హుటాహుటిన పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. రాత్రి విధుల్లో ఉన్న శ్రీను, సతీష్ అనే కానిస్టేబుళ్లపై.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శాఖాపరమైన చర్యలకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.