Agrigold Round table Conference అగ్రిగోల్డ్ బాధితుల కోసం కూడా ఓ బటన్ నొక్కడి సార్!.. రౌండ్ టేబుల్ సమావేశం
🎬 Watch Now: Feature Video
Agrigold Round Table Conference: ఎన్నో బటన్లు నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్.. అగ్రిగోల్డ్ బాధితుల కోసం కూడా బటన్ నొక్కాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. బాధితులకు ముఖ్యమంత్రి న్యాయం చేయకపోతే.. వారు రానున్న ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా బటన్ నొక్కుతారని అన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకునివెళ్లి, టీడీపీ మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. జులై నెలాఖరులోగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయ్యకుంటే ఆందోళన చేపడుతామని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇంకా 3,080 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్య ఆస్తులు ప్రభుత్వం వద్దే ఉన్నా.. బాధితులకు న్యాయం చేయకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే.. చెప్పినట్లుగానే.. ఆగస్టు నెలలో భారీ ర్యాలీని నిర్వహించి.. పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.