యథాతథంగా కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు
🎬 Watch Now: Feature Video
Aarogyasri Services : సుమారు 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఆస్పత్రులకు పెండింగ్లో ఉండటంతో శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో హుటాహుటిన అధికారులు ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కానీ అవి మొదటిసారి విఫలమయ్యాయి. కానీ రెండోసారి చర్చలు జరపడంతో ఆరోగ్యశ్రీ సేవలు యథాతధంగా కొనసాగుతాయని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది.
వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల చర్చలు జరిపాయి. వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, చికిత్సల ధరలను పెంచాలని కోరారు. మొదట చికిత్సల ధరలపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అనంతరం అధికారులు మళ్లీ చర్చలకు ఆహ్వానించారు. పెండింగ్ బిల్లులను ఈనెలాఖరుకు కొంత చెల్లిస్తామని జనవరి 15 కల్లా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలిపారు. చికిత్సల ధరల్లో ఎక్కడ మార్పులు చేయాలో ఆసుపత్రులు సూచిస్తే వాటిని పరిగణలోకి తీసుకుని ధరల మార్పులపై చర్చిస్తామని అధికారులు తెలిపారని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా జరుగుతాయని ఆయన అన్నారు.