Theft in Uravakonda: అలా వెళ్లి ఇలా వచ్చేలోగా.. స్కూటీ డిక్కీలోని రూ.8 లక్షలు మాయం
🎬 Watch Now: Feature Video
Theft in Uravakonda: స్కూటీలో పెట్టిన నగదును అగంతకులు పట్టపగలే అపహరించిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని వెలిగొండకు చెందిన రామన్న పట్టణంలో స్థిరాస్తి వ్యాపారం చేస్తాడు. ఉరవకొండలోని కెనరా బ్యాంకు నుంతి తన కుమారుడు చెన్నకేశవతో కలిసి రూ 8 లక్షలను బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని టవల్లో చుట్టి, స్కూటీ డిక్కీలో పట్టాడు.
ఆ సమయంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి, తిరిగి ప్రధాన రహదారిపై ఉన్న దస్తావేజు లేఖరు దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ కొన్ని నిమిషాల్లో పని చూసుకుని బయటికి రాగా.. వారు నగదు చుట్టి ఉంచిన టవల్ స్కూటీ వద్ద కింద పడి ఉంది. అనుమానంతో డిక్కీ తెరిచి చూడగా, అందులోని నగదు కనిపించ లేదు.. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ హరినాథ్, గ్రామీణ సీఐ శేఖర్, ఎస్సై వెంకటస్వామి ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకుతో పాటు.. వారు సంచరించిన ప్రదేశాల్లోని అందుబాటులో ఉన్న సీసీ కెమరాల ద్వారా పరిశీలించారు. బాధితుల వెంట ముగ్గురు ద్విచక్ర వాహనంలో అనుమానంగా వెంట తిరిగినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు ముఖానికి మాస్కులు, తలకు టోపీలను ధరించి, స్కూటీలోని నగదును అపహరించినట్లు పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు అర్బన్ సీఐ హరినాథ్ తెలిపారు.