ఇప్పటికే కొవిడ్ టీకాపై చాలామందిలో చాలా రకాల సందేహాలు, అపోహలు ఉన్నాయి. టీకా తీసుకుంటే లేనిపోని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అనారోగ్యాలున్న వారు వ్యాక్సిన్ తీసుకోవడం మరింత రిస్క్ అని ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇవన్నీ చూసి టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్న వారు కూడా వద్దని వెనకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి వార్తల్లో అసలు ఎంత వరకు నిజముందనే విషయాలను తెలియజేస్తూ అందరిలో అవగాహన పెంచుతున్నాయి పీఐబీ, సీడీసీ సంస్థలు. ఈ నేపథ్యంలో టీకా విషయంలో మహిళల్లో నెలకొన్న కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలపై ఆ నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..
గర్భిణులు టీకా తీసుకోవడం సురక్షితం కాదు!
సాధారణ వ్యక్తులతో పోల్చితే గర్భిణులు కొవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువ! అదే టీకా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ దుష్ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం గర్భిణుల్లో పెరుగుతుంది. అందుకే సాధారణ వ్యక్తుల్లాగే గర్భిణులూ కొవిడ్ టీకా తీసుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా మన దేశంలో గర్భిణులపై టీకా ప్రయోగాలు జరగలేదు. కానీ బయటి దేశాల్లో కొన్ని వ్యాక్సిన్లు గర్భం ధరించిన మహిళలపై ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై వ్యాక్సిన్ ఎలా ప్రభావం చూపుతుందన్న దాని గురించి ప్రస్తుతం సమాచారం సేకరించే పనిలో ఉన్నారు నిపుణులు. అయితే ఇప్పటికే గర్భం ధరించిన జంతువుల్లో ఈ టీకా ప్రయోగాలు చేపట్టగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేలింది. కాబట్టి గర్భిణులు కూడా టీకా వేసుకోవడానికి అర్హులే. అయితే ఈ విషయంలో మీకు ఏవైనా అనుమానాలుంటే మాత్రం ముందుగా మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ఆపై వారు సూచించిన సలహాలు పాటించచ్చు.
పాలిచ్చే తల్లులకు టీకా వద్దు!
ఇప్పటికే టీకా తీసుకున్న చాలామందిలో మనం గమనిస్తే.. కొద్దిమందిలో చిన్నపాటి సమస్యలు తప్ప తీవ్రమైన దుష్ప్రభావాలేమీ ఎదురుకాలేదు. దీన్ని బట్టి చూస్తే పాలిచ్చే తల్లులు కూడా టీకా తీసుకోవచ్చన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇప్పటిదాకా బాలింతలపై టీకా ప్రయోగాలు జరగకపోయినా.. ఇటీవలే విడుదలైన కొన్ని రిపోర్టులు బాలింతలు కూడా నిర్భయంగా టీకా వేసుకోవచ్చని చెబుతున్నాయి. ముఖ్యంగా టీకా తీసుకున్న తల్లుల రొమ్ముపాలలో యాంటీబాడీలు ఉన్నట్లు, అవి బిడ్డ పాలు తాగినప్పుడు వారిలోకీ ప్రవేశిస్తున్నట్లు తేలింది. తద్వారా బిడ్డ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అవి రక్షిస్తాయి. అయితే ఈ యాంటీబాడీస్ బిడ్డ ఆరోగ్యానికి ఎంత మేర ఉపయోగపడతాయన్న దానిపై ఇంకా విశ్లేషణాత్మకంగా ప్రయోగాలు జరగాల్సి ఉంది.
కొవిడ్ టీకా సంతానలేమికి కారణమవుతుంది!
ఇది ముమ్మాటికీ అపోహే. ఎందుకంటే కొవిడ్ వ్యాక్సిన్ అనే కాదు.. ఏ టీకా అయినా సరే ప్రత్యుత్పత్తి సమస్యలకు కారణమవుతుందని ఇప్పటిదాకా ఎక్కడా ఆధారాలు లేవు. అందుకే ఇప్పటికే సంతానం కోసం ప్రయత్నిస్తోన్న వారు, భవిష్యత్తులో గర్భం ధరించేందుకు ప్రణాళికలు వేసుకుంటోన్న వారు కూడా నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చు. అలాగని టీకా వేసుకోవడానికి ముందు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టీకా తీసుకున్న తర్వాత మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు తిరిగి గర్భం కోసం ప్రయత్నించవచ్చు.
టీకా తీసుకున్నాక నెలసరి సమస్యలొస్తాయి!
ఏ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతైనా చిన్నపాటి దుష్ప్రభావాలు రావడం సహజం. అయితే కొవిడ్ టీకా వల్ల నెలసరి అదుపు తప్పడం, పిరియడ్స్ సమయంలో నొప్పులు (పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి వంటివి) ఎక్కువగా రావడం.. వంటి సమస్యలు ఎదురవుతాయని కొంతమంది స్త్రీలు లేనిపోని సందేహాలు పెట్టుకుంటున్నారు. నిజానికి ఇలాంటి అనవసర భయాలే ఫలానా సమస్య ఎక్కువవుతోందన్న ఆందోళనను కలిగిస్తాయి. అయితే పిరియడ్స్ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు కామనే! అలాగని ఇవి అందరిలోనూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కాబట్టి టీకా తీసుకుంటే నెలసరి సమస్యల్ని కొనితెచ్చుకున్నట్లవుతుందన్న అపోహల్ని పక్కన పెట్టి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.. తద్వారా వైరస్ నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
సో.. ఇవన్నీ చదువుతుంటే ఏ వయసు మహిళలైనా టీకా తీసుకోవచ్చన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇతరత్రా అనారోగ్యాలు, సందేహాలున్న వారు ఎందుకైనా మంచిదని ఓసారి నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఏదేమైనా వ్యాక్సిన్ వేసుకొని కొవిడ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.. తద్వారా మన కుటుంబాన్ని, చుట్టూ ఉండే వారిని మన బాధ్యతగా రక్షించుకుందాం..!
ఇదీ చూడండి: కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం