Enquiry On YSR Kadapa District DEO: వైఎస్సార్ జిల్లా విధ్యాశాఖధికారి వ్యవహార శైలి వివాదస్పదంగా మారుతోంది. ఆయనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. పరుష పదజాలంతో టీచర్ దంపతులను దూషించినట్లు సమాచారం. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి.. విద్యాధికారి రాఘవరెడ్డిపై మరోమారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తవించారు.
అసలేంజరిగిందంటే..: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎటువంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహించకుండా.. వైఎస్సార్ కడప జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేయటంపై తీవ్ర విమర్శలు ఎదురవతున్నాయి. అదేవిధంగా సమావేశాలు, సభల్లో ఉపాధ్యాయుల పట్ల పరుషపదజాలంతో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కడప కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అంశం మీడియాలో వచ్చింది.
Complaint against DEO: కడప డీఈవోపై కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు.. ఎందుకంటే..!
మీడియాలో వచ్చిన వార్తను కొందరు ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీఈవో రాఘవరెడ్డి.. షేర్ చేసిన వారికి ఫోన్ చేసి మందలించారు. ఎవరో రాసిన వార్తలను మీరెందుకు షేర్ చేస్తున్నారు అంటూ ఉపాధ్యాయులపై మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉపాధ్యాయుడి భార్యకు ఫోన్ చేసి.. హద్దుల్లో ఉండాలంటూ కఠినంగా హెచ్చరించారు. షేర్ చేసిన ఉపాధ్యాయుడ్ని కార్యాలయానికి తిరిగి పంపించాలని ఆదేశించారు. ఆమెతో డీఈవో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతోంది. దీనిపై స్పందించిన మ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మరోసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదులో కలెక్టర్‌ను కోరారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి : డీఈవో రాఘవరెడ్డి వ్యవహార తీరుపై పలు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా సీపీఎం నాయకులు స్పందించారు. డీఈవో రాజకీయ నాయకుడిలా కాకుండా, బాధ్యతగా వ్యవహరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల విద్యాశాఖలో జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఉద్ధేశపూర్వకంగానే జిల్లాలోని ఉపాధ్యాయులను డీఈవో వేధిస్తున్నారని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయని అన్నారు. దీనిపై జిల్లా పాలనాధికారి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డీఈవో తన వైఖరిని, పద్ధతిని మార్చుకోకుంటే, వివిద సంఘాలతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు రామ్మోహన్, సుబ్బమ్మ పాల్గొన్నారు.