పట్టుదలతో ప్రయత్నిస్తే.. మహిళలు ఏ రంగంలోనైనా తమదైన ముద్ర వేయగలరని నిరూపిస్తోంది కడపకు చెందిన రాజనాల పూర్ణ. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఈమె తండ్రి గతంలో బాడీబిల్డర్. ఆయన ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే పవర్ లిఫ్టింగ్‌లో సాధన చేసింది. అనుకోని కారణాల వల్ల.. తొందరగా పెళ్లి చేసుకున్నప్పటికీ పూర్ణ పవర్‌లిఫ్టింగ్ మాత్రం వదల్లేదు.
భర్త శ్రీకాంత్ సహకారంతో పూర్ణ నిరంతరం సాధన చేస్తోంది. తన ప్రతిభతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఈమె ఆసక్తిని గమనించిన కడప జిల్లా కమలాపురం CSSR-SRRM డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి స్పాన్సర్‌గా ముందుకు వచ్చారు. ఆయన ప్రోత్సాహంతో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది పూర్ణ.
2019 జనవరిలో కోల్‌కతాలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీల్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. అదే ఏడాది కేరళలో జరిగిన జూనియర్ నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచింది. 2020లో హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారతదేశ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. 2021లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోటీల్లోనూ బంగారు పతకం కైవసం చేసుకుని.. అంతర్జాతీయ వేదికలపై వైపు అడుగులు వేసింది. 2021 డిసెంబరులో టర్కీలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు విభాగాల్లో పాల్గొంది. బంగారు పతకంతో పాటు స్ట్రాంగ్ ఉమెన్ అవార్డును కైవసం చేసుకుంది.
డిగ్రీ రెండో సంవత్సరం చదువుకుంటున్న పూర్ణ.. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకోవడంపై తోటి స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహం జరిగిన తరువాత ఇలాంటి క్రీడల్లో ప్రతిభ చాటడం గొప్ప విషయని కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇదే ఆత్మవిశ్వాసంతో కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ దేశానికి పతకం తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
పేద కుటుంబంలో పుట్టినప్పటికీ.. సరైన ప్రోత్సాహం లభిస్తే ఉన్నతస్థాయిలో రాణించలగరని నిరూపిస్తోంది పూర్ణ. కామెన్‌వెల్త్ పోటీల్లో దేశానికి పతకం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె.. అందుకు తగ్గినట్లుగా సన్నద్ధమయ్యేందుకు ప్రభుత్వం, దాతలు సహకారం అందించాలని కోరుతోంది.
ఇదీ చదవండి :
ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో ఐదు మెడల్స్- శ్లోకాలు, పద్యాల్లో దిట్ట