కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు మహిళలు సంప్రదాయ నృత్యరీతుల వైపు అడుగులు వేస్తున్నారు. కోలాటం నేర్చుకుంటున్నారు. దేవుడి ముందు నృత్యాన్ని ప్రదర్శించాలనే లక్ష్యంతో క్రమం తప్పకుండా శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయ సమీపంలో శ్రావణ్ అనే వ్యక్తి నృత్య కళాశాలను నిర్వహిస్తున్నారు. కూచిపూడి, కోలాటాలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన దగ్గరే.. వీరు శిక్షణ తీసుకుంటున్నారు.
గృహిణుల ఆసక్తి
ఈ శిక్షణ కేంద్రంలో ప్రతి రోజూ సుమారు 70 మంది విద్యార్థులు సంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్నారు. కొందరు గృహిణుల ఆసక్తి మేరకు వారికి కోలాటం నేర్పిస్తున్నారు. పదుల సంఖ్యలో మహిళలు ప్రతి రోజూ హాజరై శిక్షణ తీసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు శిక్షకుడు శ్రావణ్ వారికి మెళకువలు నేర్పుతున్నారు. మిగిలిన రెండు రోజులు సొంతంగా సాధన చేస్తున్నారు.
తిరుమలలో కోలాటమే లక్ష్యం
ఇప్పటి వరకూ 7 నెలలుగా తీసుకున్న శిక్షణలో... 18 పాటలకు పైగా కోలాట నృత్యం నేర్చుకున్నారు. తిరుమల లాంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఈ నృత్యాన్ని చేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఇంటి పనులు, వంట హడావిడి, పిల్లలను బడులకు సిద్ధం చేయడం...ఇలా రోజూ తీరకలేకుండా తెల్లవారు జాము నుంచి రాత్రివరకూ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే తమకు.. ఇలాంటి వ్యాపకం ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు. అనారోగ్యాన్నీ దూరం చేసుకుంటున్నామని ఆనందంగా చెబుతున్నారు.
ఇదీ చదవండి : వృద్ధురాలి ప్రాణం తీసిన ఆవు!