Vontimitta Brahmotsavam 2023 : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాత్రి అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. వచ్చే నెల 9వ తేదీ పుష్పయాగంతో ముగుస్తాయి. ఈ నెల 31వ తేదీన ద్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఆలయ చరిత్ర : 11వ శతాబ్ధంలో నిర్మించిన ఏకశిలానగరి-ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి. త్రేతాయుగంలో రామలక్ష్మణులు వనవాసం సందర్భంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చినపుడు రుషుల యజ్ఞాలకు రాక్షసులు భంగం కల్గించేవారు. రాక్షసులను సంహరించి బుుషుల యజ్ఞాన్ని జయప్రదం చేసిన రామలక్ష్మణులు కోదండరాముడి అవతారంలో కనిపిస్తారని ప్రతీతి. ఆంజనేయస్వామి శ్రీరాముడికి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారనేది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం కనిపించదు. పది రోజుల పాటు ఉదయం, సాయంత్రం స్వామివారి ఆలయంలో వివిధ రకాల వాహనసేవలు, అలంకారాలతో శ్రీరాముడు కొలువు తీరుతాడు. భక్తుల కోసం ఆలయం లోపల చలువ పందిళ్లు వేశారు.
ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు : శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015లో దేవాదాయశాఖ బహిరంగ ప్రదేశంలో సీతారాముల కల్యాణం నిర్వహించగా.. 2016 నుంచి ఆ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. 2016 నుంచి ఇప్పటివరకు టీటీడీ ఏటా ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది. ఏటా స్వామివారి కల్యాణ మహోత్సవానికి లక్ష మంది భక్తులు హాజరవుతున్నట్లు అంచనా.
చతుర్ధశి రోజు రాత్రి స్వామివారి కల్యాణం : ఒంటిమిట్టలో పురాణాల ప్రకారం చంద్రుడు చూసే విధంగానే శ్రీరాముడు కల్యాణం చేసుకుంటారని, అందులో భాగంగానే ఇక్కడ రాత్రి సమయంలో కల్యాణం నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కల్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజు రాత్రి స్వామివారి కల్యాణం జరుగుతుంది. కొత్తగా నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికలో గత ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం : ఈ సంవత్సరం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మునుపటి తరహాలోనే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 5న శ్రీరాముడి కల్యాణ మహోత్సవం జరగనుంది. 52 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత కల్యాణ వేదిక నిర్మించిన తర్వాత రెండోసారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. 52 వేల మంది కూర్చోని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణ ఘట్టాలను తిలకించడానికి వేదిక సిద్ధం చేశారు. రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారి కల్యాణం ఘట్టం జరగనుంది.
లక్ష మంది భక్తులు వస్తారని అంచనా : ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ మహోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో 2 లక్షల ప్యాకెట్ల ముత్యాల తలంబ్రాలను టీటీడీ సిద్ధం చేస్తోంది. తీర్థప్రసాదాలు, మంచి నీటి వసతి కల్పించనున్నారు. పోలీసులు భారీగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి