తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కొంత మంది ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్వాసన తప్పడం లేదు. లాక్ డౌన్ కారణంగా తితిదే ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న 75 ఈ-దర్శనం కౌంటర్లు మూతపడ్డాయి. వాటిల్లో పనిచేస్తున్న ఆపరేటర్లకు మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వలేదు. మరోవైపు కౌంటర్లు తెరిచేది అనుమానమేనన్న సంకేతాలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ సంబంధిత సిబ్బందికి సమాచారం అందిస్తోంది.
2004 నుంచి దేశ వ్యాప్తంగా 75 ఈ- దర్శనం కౌంటర్లు పనిచేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని తితిదే కల్యాణ మండపాల్లోనే ఈ- దర్శనం కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు టోకెన్లు ఇస్తుంటారు. అయితే మార్చి 22న మూతపడిన ఈ కేంద్రాలు... ఇప్పటివరకు తెరుచుకోలేదు. ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఉన్న ఈ -దర్శనం కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్లు దాదాపు 37 మంది సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. వెంటనే కౌంటర్లు తెరవాలని... లాక్ డౌన్ కారణంగా తమ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయని కడపలో పనిచేస్తున్న ఈ- దర్శనం కౌంటర్ ఆపరేటర్ లత కోరారు.
మరోవైపు ఈ-దర్శనం కౌంటర్ల మూతపడటంతో భక్తులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కనీసం 300 రూపాయల ఈ- దర్శనం టోకెన్ కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కేంద్రాల వద్ద 300 రూపాయల టికెట్కు 400 రూపాయలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. కౌంటర్లు తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి