Kadapa steel has not been crowned: ఇదీ.. సరిగ్గా మూడేళ్ల క్రితం.. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సగర్వంగా చెప్పిన మాటలు. మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికే పనులు పూర్తయ్యి, ప్రారంభానికి సిద్ధం కావాల్సిన ఉక్కు పరిశ్రమ.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మొక్కుబడిగా 2 కిలోమీటర్ల ప్రహరీగోడ తప్ప.. ఇతరత్రా పనులేవీ చేయలేదు. పరిశ్రమ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూముల్లో... జగన్ చేతుల మీదుగా వేసిన శిలాఫలకం ఒక్కటే దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది.పరిశ్రమ కోసం 3వేల 148 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 409 ఎకరాల డీకేటీ భూములను సేకరించారు.
గండికోట జలాశయం నుంచి 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించారు. అదే ఊపుతో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి లిబర్టీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీ దివాళాతో ఒప్పందం రద్దు చేసుకుని.. ఎస్సార్ స్టీల్‌తో కలిసి ముందడుగు వేయాలనుకున్నా కుదరలేదు. 15 వేల కోట్ల పెట్టుబడులతో ఉక్కు నిర్మిస్తామన్న లక్ష్యానికి భిన్నంగా.. 8వేల 800 కోట్లతోనే పరిశ్రమ పూర్తిచేస్తామంటున్న జిందాల్ స్టీల్‌తో ఈ నెల 13వ తేదీన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ కూడా నిర్మాణ పనులు ఎపుడు ప్రారంభిస్తుందో స్పష్టత మాత్రం రాలేదు.
శంకుస్థాపన వేళ ముఖ్యమంత్రి చెప్పిన మాటలతో.. సున్నపురాళ్లపల్లె ప్రజలు సంబరపడ్డారు. తమ ఊరి దశ మారినట్టే అని భావించారు. 15 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉపాధి కల్పిస్తామంటే.. నిరుద్యోగ యువత బతుకులు మారతాయని ఆశించారు. పునాదిరాయి వేసి మూడేళ్లయినా నిర్మాణ పనులు మొదలుకాకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. భూములిచ్చిన రైతుల్లో అందరికీ పరిహారం అందకపోవడంపైనా ఆవేదనకు గురయ్యారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. మూడున్నరేళ్ల తర్వాత కూడా ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి
ఇవీ చదవండి: