కడప నగరంలోని రమేష్ థియేటర్ సమీపంలో రాధాకృష్ణ నగర్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం కలగలేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
రాధాకృష్ణ నగర్లోని పాత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో రాజా రమేష్ మెస్ నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో వరలక్ష్మి ఆమె పిల్లలు ఉంటున్నారు. రెండో అంతస్తులో గౌసియా, షఫీ అనే భార్య భర్తలు జీవిస్తున్నారు. వీరందరూ మూడు నెలల క్రితమే ఈ భవనంలోకి వచ్చారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ తెల్లవారు జామున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శబ్దాలు రావడంతో రెండో అంతస్తులో ఉన్న భార్యాభర్తలు, మొదటి అంతస్తులో ఉన్న వరలక్ష్మి బయటికి పరుగులు తీశారు. కానీ వరలక్ష్మి కుమార్తె చంద్రిక, ఆమె బిడ్డ గదిలో చిక్కుకపోయారు. ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు గమనించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కిటికీలను యంత్రాలతో కోసి ... మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న చంద్రిక ఆమె బిడ్డను రక్షించారు. నగరపాలక అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ భవన యజమాని పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Buildings collapsed: కదిరిలో విషాదం.. భవనాలు కూలి ఆరుగురు మృతి