కడప జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 129 సర్పంచి, 824 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి, రెండు విడతల్లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే మూడో విడత ఎన్నికల్లో తక్కువమంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి విడత ఎన్నికల్లో 78 శాతం, రెండో విడత ఎన్నికల్లో 80.47 శాతం పోలింగ్ నమోదవ్వగా, మూడో విడత ఎన్నికల్లో 73.34 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వీరబల్లి మండలంలో 77.31 శాతం, అత్యల్పంగా సుండుపల్లి మండలంలో 64.63 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు చెందిన చాలామంది ఓటర్లు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం, వారందరూ ఓటేసేందుకు రాకపోవడంతో పోలింగ్ శాతంపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటేసేందుకు బెంగళూరు, మదనపల్లి, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉన్న అత్యధిక మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించు కునేందుకు వీరబల్లి మండలానికి తరలివచ్చారు.
గృహనిర్బంధాలు
సుండుపల్లి మండలంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు మేడా విజయశేఖరరెడ్డిని మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం ఎన్నికలు ముగిసేవరకు గృహనిర్బంధంలో ఉంచారు. చిన్న గొల్లపల్లెకు చెందిన జి.శివశంకరనాయుడు (గుట్టబాబు), జి.రెడ్డివారిపల్లెకు చెందిన సి.రమేష్‌నాయుడిని మంగళవారం రాత్రి నుంచి అదుపులోకి తీసుకుని బుధవారం మధ్యాహ్నం అనంతరం ఓటుహక్కును వినియోగించుకునేందుకు పంపించారు.
పరిశీలనలు
సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామంలోని అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను కలెక్టరు హరికిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుండుపల్లి మండలం రాయవరం, రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి, వీరబల్లి మండలం వీరబల్లి, గడికోట, వంగిమళ్ల గ్రామాల్లో ఎన్నికల సరళిని ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. సిద్దవటం మండలం మాధవరం-1, బంగారుపేట, నందలూరు మండలం నాగి రెడ్డిపల్లె, నందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు రంజిత్‌బాషా తనిఖీ చేశారు. రాజంపేట మండలం తాళ్లపాక, గుండ్లూరు, ఊటుకూరు ప్రాంతాల్లో పోలింగ్ సరళిని సబ్‌కలెక్టర్ కేతన్‌గార్గ్ పరిశీలించారు. రైల్వేకోడూరు మండలంలోని పలు చోట్ల ఎన్నికల ఏర్పాట్లను జేసీ గౌతమి పర్యవేక్షించారు.
ఫిర్యాదులు.... వాగ్వాదాలు...
రైల్వేకోడూరు మండలం చియ్యవరంలో వైకాపా, తెదేపా మద్దతుదారుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరాజుపేటలో అధికార పార్టీలోనే రెండు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బొజ్జవారిపల్లె పంచాయతీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వర్గానికి చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని మరో వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్నవారిని పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. సిద్దవటం మండలం సి.కొత్తపల్లె పోలింగ్ కేంద్రం ఆవరణలో అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మూలపల్లి పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్దకు రానీయకుండా పోలీసులు తమను బలవంతంగా అడ్డుకున్నారంటూ తెదేపా నాయకులు ఆరోపించారు.
అసౌకర్యాలతో అవస్థలు
రైల్వేకోడూరు పట్టణంలోని 17వ వార్డులో షామియానాల కింద రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఏఎల్‌సీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కనీస వసతులు కరవయ్యాయి. అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లె, చియ్యవరం పంచాయతీ మొలకలపోడు హరిజనవాడలో షామియానాలతో తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. సి.కమ్మపల్లె పంచాయతీ ఓటర్లకు రెండు కిలోమీర్ల దూరంలోని కేఆర్‌కండ్రిగలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో వృద్ధ, దివ్యాంగ ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు.
విజయవంతం
రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని కలెక్టరు హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఎన్నికల దృష్ట్యా 12,128 మందిని బైండోవర్ చేశామన్నారు. 17 కిలోల గంజాయి, 520 లీటర్ల అక్రమ మద్యం, 215 లీటర్ల నాటుసారా, రశీదుల్లేని రూ.1.32 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: లెక్కింపైనా ఫలితాలు ప్రకటించట్లేదు : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ