కొవిడ్-19 నిబంధనల అమలుపై కడప జిల్లా రాయచోటిలో పోలీసులు, మోటార్ వాహనాల తనిఖీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు. వాహనాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాహనంలో ప్రయాణించే వారి మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మాస్కులు ధరించి..
మాస్కులు ధరించని వాహనదారులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పట్టణంలోని జాతీయ రహదారి, రింగ్ రోడ్డు కూడలిలో సుమారు 100 వాహనాలను తనిఖీ చేసి కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
త్వరలో కఠినంగా అమలు..
నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వాహనాలను తనిఖీ చేస్తారన్నారు. మాస్కులు లేకుండా, వాహన దస్త్రాలు సక్రమంగా లేకుండా పట్టుబడే వారికి భారీ జరిమానా ఉంటుందని మోటార్ వాహనాల తనిఖీ అధికారి రాజేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : మేం పెయిడ్ ఆర్టిస్టులమైతే.. మరి మీరెవరు ?: అమరావతి రైతులు