పచ్చని కుటుంబాన్ని ప్రాణాంతక వ్యాధి ఛిన్నాభిన్నం చేసింది. కడప జిల్లా చెన్నూరు మండలం చెన్నూరు శివాలయం వీధికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అరుదుగా సోకే మస్క్యులర్ డెస్ట్రొఫీ బారిన పడ్డారు. తల్లి పద్మావతి 30 ఏళ్ల క్రితమే ఈ వ్యాధికి గురై మంచానికే పరిమితమయ్యారు. ఉన్నత చదువులు చదివిన కుమారుడు, కుమార్తె చక్కని ఉద్యోగాల్లో స్థిరపడేలోపే వారిలోనూ కండరాల వ్యాధి బయటపడింది.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఖాయం కానున్న తరుణంలో కుమార్తెకు సోకిన ఈ వ్యాధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రైవేటు ఉద్యోగిగా స్థిరపడిన ఆమె సోదరుడు సైతం కొన్ని రోజుల్లో ఇదే రీతిలో అశక్తుడుగా మారిపోయాడు. 10 ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్న వారు... చూస్తుండగానే ఎవరైనా సాయం ఉంటే తప్ప మనుగడ సాగించలేని స్థితికి చేరుకున్నారు.
మస్క్యులర్ డెస్ట్రొఫీ బారినుంచి బయటపడేందుకు ఆ కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఇల్లు, కొద్దిపాటి పొలాన్ని అమ్ముకొని వైద్యం కోసం అనేక రాష్ట్రాలు తిరిగారు. అది వారికి శక్తికి మించిన ప్రయత్నమే అయింది. ఇప్పుడు ప్రతి నెలా మందులూ, ఫిజియో థెరపీకి స్థోమత చాలక ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. తల్లి, సోదరుడు, సోదరి కలిపి ముగ్గురు వ్యక్తుల పోషణ భారమే అయినా మరో సోదరి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రభుత్వం, దాతలు... చికిత్సకు అవసరమైన సాయం అందించాలని బాధిత కుటుంబం కోరుతోంది.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా విజృంభణ...కొత్తగా 10,276 కేసులు