Chandrababu naidu : తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయడు బద్వేలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సోమిరెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశాన్ని బద్వేలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని సూచించారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరగాలని పేర్కొన్నారు.
అమరావతిని నాశనం చేశారు.. ఎక్కడ జగన్ ఉంటే.. అక్కడ శనే.. జగన్ ఓ ఐరన్ లెగ్.. అని చెప్పిన చంద్రబాబు.. అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ పదవికి ఎక్స్‌పైరీ తేదీ వచ్చేసిందని, ఇకపై జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని తెలిపారు. జగన్‌ను చూసి విశాఖ వాసులు భయపడుతున్నారని చెప్పారు. వివేకా హత్యలాంటి సస్పెన్స్ క్రైమ్ సినిమా ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. వివేకా హత్య లాయర్లకు ఓ కేస్ స్టడీగా మిగిలిపోతుందన్నారు.
టీడీపీ అండ.. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేస్తూ.. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా.. పార్టీ మీ వెంటే అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తల కోసమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పెట్టాం.. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకుంటున్నాం అని తెలిపారు. రూ.5 వేలు విరాళం ఇచ్చిన వారికి జీవితకాల సభ్యత్వం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల ఎందరో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని, వారంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కేవలం సిద్ధాంతాలు చెప్పడానికే కాదు.. పాటించడానికి ఉందని అన్నారు.
మూడు రోజుల పర్యటన.. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. సాయంత్రం గిద్దలూరు చేరుకోనున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ తర్వాత అక్కడి నుంచి మార్కాపురం చేరుకొని బస చేస్తారు. రేపు ఉదయం చిన్నారులు, మహిళల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకల తర్వాత మహిళలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు మార్కాపురం పట్టణంలో చంద్రబాబు రోడ్ షో అనంతరం స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో బహిరంగ సభ ఉంటుంది. ఆ రాత్రికి మార్కాపురంలోనే చంద్రబాబు బస చేయనున్నారు. 21న రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం మార్కాపురం నుంచి యర్రగొండపాలెం బయల్దేరి వెళతారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ వెళతారు.
సైకో శాడిజం ఏంటో... విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పేర్లు మార్చే ఈ సైకో శాడిజం ఏంటో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. పేరు మార్పు వ్యవహారం.. నిజాయితీ, క్రమశిక్షణ పట్టుదలకు ప్రతీకగా నిలిచిన రాష్ట్రపతిని అగౌరవపరచడం తప్ప మరొకటి కాదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి :