TDP MLC candidate Bhumireddy Ramgopal Reddy: ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సీఎం జగన్ మరోమారు కడప ఉక్కు పరిశ్రమకు ఎలా శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను మోసగించేందుకే కడప ఉక్కు పరిశ్రమకు సీఎం మరోసారి శంకుస్థాపన చేశారని మండిపడ్డారు.
తన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సీఎం మరో మోసానికి తెర లేపారని రాంగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. సీఎం జగన్ చర్యల పట్ల రాయలసీమ యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ఆరోపించారు. రాయలసీమకు కేటాయించిన సంస్థలను సీఎం జగన్ ఇతర ప్రాంతాలకు తరలించారని ధ్వజమెత్తారు. రాయలసీమకు దగ్గరగా ఉన్న రాజధాని అమరావతిని సైతం దూరంగా విశాఖకు తరలిస్తున్నారని మండిపడ్డారు.
'సీఎం జగన్ రాయలసీమ యువతను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 సంవత్సరంలో జగన్ కడప ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేశారు. ఇప్పుడు జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందునే మరోసారి భూమిపూజ చేశారు. యువత నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. గత మూడు సంవత్సరాల్లో ఉక్కు పరిశ్రమ కోసం ఒక్క ఇటుకను సైతం వేయని జగన్.. ఇప్పుడు మళ్లీ యువతను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు అమలులో ఉండగా... కడప ఉక్కు కోసం భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ అంశంపై స్పందించాలి. మరోవైపు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో పెట్టాల్సి ఉండగా.. దానిని విశాఖలో పెట్టారు.'- భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి
ఇవీ చదవండి: