ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడానికి కడప కేంద్ర కారాగారానికి చేరుకున్న తెదేపా నేతలకు అనుమతి లభించలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరి కొందరు నేతలు కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. జేసీకి ఆరోగ్యం బాగాలేదని.. వారి కుటుంబసభ్యుల నుంచి సమాచారం రావడంతో పరామర్శించడానికి వచ్చానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
జైల్లో ఎవ్వరికీ ములాఖత్‌లు ఇవ్వడంలేదని... జేసీ ఆరోగ్యం గురించి తాము చూసుకుంటామని జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. దీంతో జిల్లా తెదేపా నేతలు వెనుదిరిగి వెళ్లిపోయారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు నమోదు చేయించిందని... అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతలను కేసుల్లో ఇరికించారని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జేసీకి త్వరలోనే బెయిల్ కూడా వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నా: చంద్రబాబు