Madakasira Road Accident Today : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మడకశిర మండలం బుళ్లసముద్రం జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామన ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను హిందూపురం, బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 14 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT