TDP Ex MLC Btech Ravi on Avinash: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కి అడ్డంకులు సృష్టిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా.. బరితెగించి దౌర్జన్యాలు చేస్తున్నారని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. గతంలో సీబీఐ విచారణ సందర్బంగా తాడేపల్లి ప్యాలెస్ పేర్లను అవినాష్ రెడ్డి చెప్పడంతోనే.. ఇపుడు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి అక్రమ సంపాదన అంతా 2 వేల రూపాయల నోట్ల రూపంలో భద్రపరిచారని.. దానికి అవినాష్ రెడ్డి ఫింగర్ ప్రింట్ అవసరం ఉందని ఆరోపించారు. అవినాష్ జైలుకు వెళ్తే.. ఆ డబ్బంతా మార్చుకోకుండా భారీ నష్టం జరుగుతుందనే ఇద్దరూ కలిసి అరెస్ట్‌ను అడ్డుకుంటున్నారని బీటెక్ రవి అన్నారు. ఈ నెల 25న కొత్త సీబీఐ డైరెక్టర్ వస్తే తమకు అనుకూలంగా ఉంటారని.. అంతవరకు అరెస్ట్ కాకుండా చూసుకుంటామని పులివెందుల వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి అరెస్టు చేయకుండా డ్రామాలాడితే వైసీపీకి నష్టమన్న సంగతి వాళ్లకి కూడా తెలుసు. అవినాష్ అరెస్టును 25వరకు పోస్టుపోన్ చేస్తే.. సీబీఐకి కొత్త డైరెక్టర్ వస్తాడని పులివెందుల వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే ఈ డ్రామాలకు తెరలేపారు. మాకున్న సమాచారం ప్రకారం జగన్ మోహన్ రెడ్డి అక్రమ సంపాదన కానీ, అవినాష్ రెడ్డి అక్రమ సంపాదన అంతా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో ఎక్కడో భద్రపరుచుకున్నారు. వాటికి అవినాష్ రెడ్డి వేలిముద్రలు అవసరం అందుకే అవినాష్ రెడ్డి అరెస్టు అడ్డుకుంటున్నారు- బీటెక్ రవి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ
వాళ్లపై రౌడీషీట్ ఓపెన్ చెయ్యాలి: కర్నూలులో పులివెందుల వాసులు దౌర్జన్యం చేయడం, అరాచకం సృష్టించడం, పోలీసులు చేతులెత్తేయడం చూస్తే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. కర్నూలులో దౌర్జన్యం చేసిన వైసీపీ నాయకులపై రౌడీషీట్ పెట్టాలని డిమాండు చేశారు.
"అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ.. డబ్బులు ఉన్నాయని, న్యాయవాదులు దొరుకుతారని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై దాడులు, కెమెరాలు ధ్వంసం చేయడం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కర్నూలు ఎస్పీ అంటున్నారు. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేస్తే లేని సమస్య అవినాష్ అరెస్టుకే ఎందుకు" -శ్రీనివాసులరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి: